గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు

 గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు 

2006లో మొదలు పెట్టబడిన ప్రపంచములోనే అతిపెద్ద పేదరిక నిర్ములన కార్యక్రమం. రాజకీయ సమీకరణాలు మారినా దిగ్విజయంగా వెలుగుతున్న తీరు. 2020-21లో లక్ష కోట్లఫై చిలుకు బడ్జెట్ , 6.51 కోట్ల పేదప్రజలకు 130.9 కోట్ల పనిదినాలు ఒక్క ఏడాదిలో కల్పిస్తున్న సందర్భం. కార్యక్రమ ఉద్దేశం ప్రకారం 60శాతం నిధులు వ్యవసాయ పద్దు అంటే నీరు, చెట్టు, భూమి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. 74 శాతంపైనా వీటి నిమిత్తం ఖర్చుచేసినట్టు ఉన్నలెక్కలు. 

ఎక్కడ పేదరికం ఎక్కువవుందో అక్కడ ఖర్చు ఎక్కువ పెట్టే ఉద్దేశ్యంతో రాష్ట్రము, జనాభా ప్రాతిపదికన కేటాయించని పథకం. పథకం ఆరంభించి 15 ఏళ్ళు దాటినా పేదరికంలో కొట్టాడుతున్న బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు పథకాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోని పరిస్థితి. 18% తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేవలం  4.8% బీహార్, 7% యూపీ , 2.7% మహారాష్ట్ర ఉపయోగించుకున్నాయంటే కార్యక్రమ లక్ష్యాలు ఎలా గతి తప్పుచున్నాయో అర్ధం చేసుకోవచ్చు.  

గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లపేరుతో లక్షలకోట్లు గ్రామీణ ఉపాధి నుండి మెటీరియల్ కంపోనెంట్ పేరుతో ఖర్చుచేస్తున్న తీరు చూస్తే ఈ కార్యక్రమం పేదప్రజల కడుపునింపడానికి పెట్టిందా లేక కార్పొరేట్ కంపెనీల జేబులు నింపటానికి పెట్టిందా అనే అనుమానం ఇప్పుడెపుట్టిన పసికందుకుకూడా కలుగుతుంది. గుత్తేదారులకు  గుత్తగా దోసిపెట్టే బదులు మనం గొప్పగా చెప్పుకొనే స్వయం సహకార సంఘాలకు అప్పచెబితే పేదలకు పనిదోరుకుతుందికదా. సిమెంట్ రోడ్లు మాత్రమే కాకుండా తారు, కంకర రోడ్డులు కూడా వేయవచ్చు. 

అధికమొత్తంలో పథకాన్ని వాడుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం వెలిగిపోతుందా అంటే అదీలేదు. అన్నదాతల ఆక్రందనలు ఆకలి చావులు. కూలీల కొరత, పెరిగిన ఎరువుల ధరలతో వ్యవసాయం గిట్టుబాటులేదనే రైతుసోదరులు. ఏమిటీ పరిస్థితి, ఎందుకీదుస్థితి? శేత్రస్థాయిలో ఉపాధిహామీ పనులను చూస్తే ఎక్కువగా మట్టి పని,కాలువల్లో  పూడిక తీయడం, ఇంకుడు కుంటలు లాంటి పనులపై ఎక్కువ ఖర్చు. 8 గంటలు పనిని 2-3 గంటల్లో పూర్తిచేస్తున్నారంటే ఎస్టిమేట్స్ లో లోపం అనుకోవాలా, పర్యవేక్షణా లోపమనుకోవాలా? 16 ఏళ్ళనుండి అదే పనులు చేస్తున్నామంటే కనీసం పథకాన్ని ఎక్కువగా వాడుకుంటున్న రాష్ట్రలోనన్నా అట్టి పనులు తగ్గివుండాలి, కానీ పెరుగుతున్న సందర్భం.  ఇది దేనికి సంకేతం? 

2006లో ఉపాధి హామీ పథకం పెట్టినప్పటినుండి ఇప్పటికి పేదరికం, గ్రామీణ వృత్తి విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. భూమీలేని అనేకమంది పేదవారు ప్రభుత్వ పధకాలద్వారా భూమి పొంది, కౌలుకి భూములు తీసుకొని రైతులుగామారి అంతస్థు పెంచుకుంటున్న సందర్భం. అట్టి పేదవాడికి రైతు కష్టంతెలుసు , అందుకే వారు కూడా ఈ పథకాన్ని వ్యవసాయా కి జోడిస్తే మంచిది అని కోరుకొంటున్నారు. వ్యవసాయ పెట్టుబడిలో కూలి ఖర్చులు ముఖ్యమైన భాగం.  కొంత కూలి ఖర్చు ఉపాది హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేయడంద్వారా రైతు సోదరులకు , బడుగు బలహీన వర్గాలనుండి రైతుగా మారిన అనేక కుటుంబాలకు మేలు చేయవచ్చు. ఇది అనేక ఏళ్లగా నలుగుతున్న కోరిక, సమస్య. నీతి  ఆయోగ్ లాంటి సంస్థలు పెద్దమనసుతో అలోచించి ఈప్రక్రియ పూర్తి చేస్తే రైతులకు మేలు చేయటమే కాకుండా దెశ సంపదకు జవాబుదారీతనం పెరుగుతుంది. 

ఉదాహరణకి మొక్క జొన్న పంట తీసుకుందాం. ఎకరానికి విత్తనం వేయటానికి 6 మంది , నీళ్లు పెట్టటానికి 8 మంది, ఎరువులు , కలుపుకి 8 మంది, పంట కోయటానికి 10 మంది అంటే మొత్తం 32 పని దినాలు కావాలి. ఇందులో 75 శాతం ఉపాధి హామీ పథకంనుండి కేటాయిస్తే గ్రామీణప్రాంతాల్లో కూలీలకు నిండుగా పని దొరుకుతుంది. 

మన ప్రజల్లోని ఉత్పాదకత పెంచుదాం - ఉత్తమ విలువల భారత దేశాన్ని నిర్మిద్దామ్. 


బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ - BGR - 9866889246

grbonthu@gmail.com

Comments

Unknown said…
How about initiating action program. Circulate
మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGA) వ్యవసాయానికి అనుసంధానంలో సహేతుకత ఎంత?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1.43 కోట్ల ఎకరాల పంట భూములకు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని 2018 లో ప్రవేశ పెట్టింది. ఖరీఫ్, రభీ సీజన్ లలో పంటలు వేసిన రైతులకు ప్రతి సీజన్ లో ఎకరాకు 5000 రూపాయాలు ఈ పథకం కింద ప్రకటించింది. ఒక్క సీజన్ లో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో పంటలు వేస్తే ఎకరానికి 5000 రూపాయలు చొప్పున రైతులకు చెల్లాంచాల్సిన డబ్బు 7150 కోట్ల రూపాయాలు.

తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో రైతు బంధు పథకం కింద 35,676 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో 2019 - 20 సంవత్సరంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGA) కింద 1719 కోట్ల రూపాయలు 2019 - 20 సంవత్సరంలో ఖర్చు చేసారు. చాలా గ్రామాల్లో ప్రధానంగా వర్షాదారిత వ్యవసాయంలో సాగుకాలం కేవలం 90 నుండి 120 రోజులు. మరొకమాటలో చెప్పాలంటే సంవత్సర కాలంలో 90 నుండి 120 రోజుల కాలంలో మాత్రమే కూలీలకు పని దొరుకుతుంది. కావున ఈ పథకం ప్రధానంగా వ్యవసాయ పనులు లేని రోజులలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని కల్పించడం ద్వారా, కూలీలకు జీవనం జరగడానికి ఏర్పాటు చేసారు. ఈ పథకం అమలు విషయంలోకి మేము లోతుగా పోవడం లేదు.

MGNERGA ద్వారా వచ్చే డబ్బులు రైతు పొలాల్లో పనిచేసే కూలీలకు రైతులు ద్వారా అందచేసి, ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్ ను చాలా మంది రైతులు, రైతు నాయకులు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కింద పొందపర్చిన విషయాలను గమనించ వలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి = 1.43 కోట్ల ఎకరాలు
MGNREGA కింద తెలంగాణ రాష్ట్రంలో 2019 - 20 సంవత్సరంలో ఖర్చు చేసిన డబ్బు = 1719 కోట్ల రూపాయలు
MGNREGA ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ( ? ) ప్రతి ఎకరానికి లభించే డబ్బు = 1202 రూపాయాలు.

MGNREGA ద్వారా ఒక రాష్ట్రానికి వచ్చే డబ్బునంతా రైతులకు పంచిన వారికి ఎకరానికి వచ్చేది కేవలం 1202 రూపాయాలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి పంట సీజన్ కు ఎకరాకు 5000 రూపాయలు ఇస్తున్నది. దీనిని 6000, లేదా 7000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేయవచ్చు.

కరువు పీడిత, వర్షదారిత ప్రాంతాల్లో సంవత్సరంలో చాలా రోజులు పని దినాలు లభించక ఇబ్బంది పడుతున్న కూలీల జీవనం కోసం ఏర్పాటు చేసిన MGNREGA స్కీం అమలులో లోపాలను సరిదిద్దడానికి సూచనలు చేయవచ్చు. లేదా విజ్ణులు ఇతర సూచనలు చేయవచ్చు.‌ కాని రైతుల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి MGNREGA ను రైతులకు అనుసంధానం చెయ్యాలని డిమాండ్ చేయడంలో ఉన్న సహేతుకత ఎంతో ఆలోచించాలి.

బొజ్జా దశరథ రామి రెడ్డి, అధ్యక్షులు
రాయలసీమ సాగునీటి సాధన సమితి

Popular posts from this blog

HIDDEN GEMS IN INDIAN MANGOES- WORTH HUNTING RARE TREASURES

ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి

Ongole Cattle Breed- Pride of India- Wealth of Brazil